A Brave Woman Fight With Tiger For Her Husband : యముడితో పోరాడి భర్త ప్రాణాలను తిరిగి సాధించిన సాధ్వి అనసూయ గురించి పురాణాల్లో విన్నాం. కానీ ఈ సుజాత.. నోట కరచుకోవడానికి పంజా విసిరిన పులితో పోరాడి భర్తను కాపాడుకుంది. భారీ ఆకారం, చెవులు చిల్లులు పడే గాండ్రింపు, పదునైన కోరలు, గోళ్లతో బెబ్బులి పైకి వస్తే భయానికే సగం ప్రాణాలు పోతాయి. అలాంటిది పంజా విసిరితే మనిషి అచేతనమవుతాడు. ప్రాణాలు కోల్పోతాడు. ఈ పరిస్థితుల్లో సైతం తన భర్త రౌతు సురేశ్ ప్రాణాలను దక్కించుకునే ప్రయత్నం చేసింది సుజాత.
భర్త కోసం పులినే ఎదిరించిన భార్య : సురేశ్, సుజాత దంపతులు. వీరు సిర్పూర్(టి) మండలం దుబ్బగూడలో నివసిస్తున్నారు. వీరికి వ్యవసాయమే జీవనాధారం. పొలంలో అడవి పందులు పంటలను నాశనం చేస్తున్నాయని సురేశ్ రాత్రుళ్లు అక్కడే నిద్రిస్తూ కాపలా కాస్తున్నాడు. ఎన్నడూ పులి గానీ, ఇతర జంతువులేవీ కానీ కనిపించలేదు. రోజూలాగే సుజాత శనివారం ఉదయం చేనుకి వెళ్లి, పత్తి ఏరుతుండగా కొద్ది సమయం తర్వాత తన భర్త ఎడ్లబండి తీసుకుని అక్కడికి వచ్చాడు. ఆ పక్కనే పొదల్లో మాటువేసిన పులి ఒక్కసారిగా అతడిపై దూకింది.
భర్త మెడపై పులి పంజా : మెడపై పంజా విసరడంతో అతను గట్టిగా అరుస్తూ కింద పడిపోయాడు. దీంతో కొంత దూరంలో ఉన్న భార్య సుజాత ఒక్కసారిగా భీకరంగా ఉన్న పులిని చూసి బిత్తరపోయింది. రక్తమోడుతోన్న తన భర్తను చూశాక క్షణం కూడా ఆలస్యం చేయకుండా చేతికందిన రాళ్లు, కర్రలు తీసుకుని పులి మీదకు విసిరి అరవడంతో ఆ పులి భయంతో దారి మార్చుకుంది. వెంటనే తోటి రైతులు అక్కడికి వచ్చి ఆసుపత్రికి తీసుకెళ్లారు.
తన భర్త ఆస్పత్రిలో ఉండటం చూసి చాలా భయపడ్డానని సుజాత చెప్పుకొచ్చారు. ఒకరోజు గడిచినా మాములు మనిషిని కాలేకపోయానన్నారు. ఇప్పుడిప్పుడే ఆయన కోలుకోవడం సంతోషంగా ఉందని, తాను ఆ రోజు ధైర్యం కోల్పోయి ఉంటే, ఈరోజు ఇద్దరం మిగిలి ఉండే వాళ్లం కాదేమో అని సుజాత తెలిపారు.