Monday, September 23, 2024

TG DSC Results 2024 : పూర్తికావొచ్చిన కసరత్తు - ఏ క్షణమైనా డీఎస్సీ ఫలితాలు..!

 


తెలంగాణ డీఎస్సీ ఫలితాల విడుదలకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇప్పటికే టెట్ వివరాల సవరణ అవకాశం కూడా ముగిసింది. దీంతో ఏ క్షణంలోనైనా జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ ను ప్రకటించే అవకాశం ఉంది. ఆ తర్వాత ధ్రువపత్రాల పరిశీలన తర్వాత… నియామక పత్రాలు అందజేస్తారు.
తెలంగాణ డీఎస్సీ ఫలితాలు విడుదలకు విద్యాశాఖ కసరత్తు దాదాపు పూర్తి కావొచ్చింది. ఇటీవలే టెట్ వివరాల సవరణకు కూడా అవకాశం ఇచ్చింది. ఈ గడువు కూడా పూర్తి కావటంతో… జనరల్ ర్యాకింగ్ లిస్ట్ ను ప్రకటించే అవకాశం ఉంది.
జిల్లాల వారీగా మెరిట్ జాబితా వెల్లడి చేయనుంది. మెరిట్‌ జాబితా జారీ విడుదల తర్వాత ధ్రువపత్రాల పరిశీలన చేపట్టేందుకు ఏర్పాట్లు చేస్తారు. జనరల్ ర్యాకింగ్ లిస్టులను ఏ క్షణమైనా ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇప్పటికే ఆ దిశగా విద్యాశాఖ కసరత్తు పూర్తి అయినట్లు సమాచారం.

సాధ్యమైనంత త్వరగా కొత్త టీచర్ల సేవలను వాడుకోవాలన్న ఉద్దేశ్యంతో సర్కార్ ఉంది. ఈ విషయంలో ఓ డెడ్ లైన్ కూడా పెట్టుకుని పని చేస్తోంది. ఈ క్రమంలో డీఎస్సీ పరీక్షలను కూడా వాయిదా వేయకుండా షెడ్యూల్ ప్రకారమే పూర్తి చేసింది. ప్రాథమక కీలను కూడా త్వరగానే విడుదల చేసినప్పటికీ… ఫైనల్ కీ విడుదల చేసేందుకు సమయం తీసుకుంది. మరోవైపు టెట్ వివరాల అప్డేట్ కోసం రెండు రోజులకుపైగా ప్రత్యేకంగా గడువు ఇచ్చింది. చాలా మంది అభ్యర్థులు ఈ ఆప్షన్ ద్వారా…వారి టెట్ వివరాలను సవరించుకున్నారు. ఫలితంగా టెట్‌ మార్కులతో పాటు డీఎస్సీ మార్కులను కలిపి జనరల్‌ ర్యాంకింగ్‌ లిస్ట్‌ను విడుదల చేస్తారు.

జిల్లాల వారీగా జనరల్ ర్యాంకులను ప్రకటించిన తర్వాత…. ధ్రువపత్రాల పరిశీలన ఉండనుంది. ఇందుకోసం ఒక్క పోస్టుకు ముగుగు చొప్పున ఎంపిక చేయనున్నారు. ఈ ప్రక్రియ పూర్తి తర్వాత…పోస్టుకు ఒకరికి ఎంపిక చేస్తారు. వారికి నియామక ఉత్తర్వులను అందజేస్తారు. అయితే మొత్తం ప్రక్రియల్ జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ కీలకంగా ఉంటుంది. ఇందులోని ర్యాంకులను బట్టి అభ్యర్థులు ఓ అంచనాకు రావొచ్చు.
ఇక ఈ ఏడాది నిర్వహించిన తెలంగాణ డీఎస్సీ పరీక్షలకు మొత్తం 2,79,957 దరఖాస్తు చేసుకోగా.. 2,45,263 మంది పరీక్షకు హాజరయ్యారు. దాదాపు 34,694 మంది అభ్యర్ధులు పరీక్షలు రాయలేదు. అత్యధికంగా సెకండరీ గ్రేడ్‌ టీచర్‌ (ఎస్‌జీటీ) పోస్టులకు 92.10 శాతం మంది అభ్యర్ధులు హాజరయ్యారు.

ఈ నోటిఫికేషన్ లో భాగంగా మొత్తం 11,062 టీచర్ల పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టుల వారీగా చూస్తే.. 2,629 స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టులు ఉండగా, 727 భాషా పండితులు, 182 పీఈటీలు, 6,508 ఎస్జీటీలు, స్పెషల్‌ ఎడ్యుకేషన్‌ 220 స్కూల్‌ అసిస్టెంట్లు, 796 ఎస్జీటీ ఉద్యోగాలు ఉన్నాయి.

డీఎస్సీ జనరల్ ర్యాకింగ్ లిస్ట్ ను ఇలా చెక్ చేసుకోండి:
డీఎస్సీ పరీక్ష రాసిన అభ్యర్థులు  https://schooledu.telangana.gov.in/ISMS/  వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
డీఎస్సీ రిక్రూట్ మెంట్ - 2024 ఆప్షన్ పై నొక్కాలి. కొత్త విండో ఓపెన్ అవుతుంది.
ఇక్కడ కనిపించే హోం పేజీలో TG DSC జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ అనే ఆప్షన్ ఉంటుంది.
దీనిపై క్లిక్ చేస్తే జిల్లాల వారీగా అభ్యర్థుల వివరాలు డిస్ ప్లే అవుతాయి.
డౌన్లోడ్ లేదా ప్రింట్ ఆప్షన్ పై నొక్కి కాపీని పొందవచ్చు.