Thursday, September 26, 2024

Jowar Roti Benefits- జొన్న రొట్టెలు రోజూ తినడం వల్ల జరిగేది ఇదేనట! - నిపుణుల సూచనలు మీకోసం -


 ప్రస్తుత కాలంలో చాలా మంది జొన్నరొట్టెలకే మా ఓటు అంటున్నారు. హెల్దీగా ఉండాలన్నా.. ఊబకాయం రాకూడదన్నా ఇవే తినడం బెస్ట్‌ అంటున్నారు నిపుణులు కూడా. మరి.. రోజూ జొన్న రొట్టెలు తినడం వల్ల శరీరంలో ఎటువంటి మార్పులు వస్తాయో మీకు తెలుసా?

 

Jowar Roti Benefits : బరువు తగ్గాలనుకునే వారు, మధుమేహంతో బాధపడేవారు ఇలా చాలా మంది ప్రస్తుత కాలంలో రాత్రి అన్నం తినకుండా చపాతీలు తింటున్నారు. అయితే.. ఇటీవల జొన్న రొట్టెలు తినేవారి సంఖ్య పెరుగుతోంది. మరి.. రోజూ జొన్న రొట్టెలు తింటే ఏం జరుగుతుందో ఇప్పుడు చూద్దాం.

జొన్నల్లో ఆరోగ్యానికి మేలు చేసే ఎన్నో రకాల పోషకాలున్నాయని NIH బృందం వెల్లడించింది. (National Library of Medicine రిపోర్ట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి). ముఖ్యంగా ఇతర తృణధాన్యాలతో పోలిస్తే.. జొన్నలలో శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్ ఫినోలిక్ సమ్మేళనాలున్నాయి. ఇవి జీర్ణక్రియను మెరుగుపరచడంతోపాటు, దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తాయని వెల్లడించారు.

పోషకాలు అనేకం!

జొన్నలలో విటమిన్ బి3, బి1,​ బి2, ఖనిజాలు, ఫైబర్, ప్రొటీన్లు​ పుష్కలంగా ఉన్నాయి. ఇవి శరీరానికి శక్తిని అందిస్తాయి. ఇందులోని ఫైబర్​ కండరాలను బలంగా ఉంచుతుంది. అలాగే పోషకాలు చర్మం ఆరోగ్యంగా ఉండేలా చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. జొన్న రొట్టెలలో ఆక్సిజన్​ సరఫరా జరగడానికి అవసరమయ్యే ఇనుము ఎక్కువగా ఉంటుంది.

ఎముకలు దృఢంగా..

జొన్న రొట్టెలలో ఎముకలు, దంతాలు దృఢంగా ఉండడానికి అవసరమయ్యే ఫాస్పరస్‌, కాల్షియం వంటి ఖనిజాలు ఎక్కువగా ఉన్నాయి. రోజూ జొన్న రొట్టెలు తినడం వల్ల ఎముకలు, దంతాలు ఆరోగ్యంగా, బలంగా ఉంటాయి.

తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్​ కలిగిన ధాన్యం..

గోధుమలతో పోలిస్తే జొన్నలు తక్కువ గ్లైసెమిక్​ ఇండెక్స్​ కలిగిన ధాన్యం. డయాబెటిస్​తో బాధపడేవారు జొన్న రొట్టెలు తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు నెమ్మదిగా, స్థిరంగా పెరుగుతాయి. అందుకే.. మధుమేహంతో బాధపడేవారు వీటిని తినాలని నిపుణులు సూచిస్తున్నారు. 2017లో 'జర్నల్ ఆఫ్ న్యూట్రిషన్ అండ్ మెటబాలిజం'లో ప్రచురించిన అధ్యయనం ప్రకారం.. జొన్న రొట్టెలు తినడం వల్ల టైప్ 2 డయాబెటిక్ రోగులలో బ్లడ్ గ్లూకోజ్ స్థాయిలు తగ్గుతాయని పరిశోధకులు గుర్తించారు. ఈ పరిశోధనలో లూథియానాలోని పంజాబ్ అగ్రికల్చరల్ యూనివర్సిటీకి చెందిన 'డాక్టర్ కుమార్' పాల్గొన్నారు.

  • జొన్న రొట్టెలు తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
  • జొన్న రొట్టెలలో ఉండే ఫైబర్​ జీర్ణప్రక్రియను మెరుగుపరుస్తుంది.
  • అలాగే ఇవి రెండు రొట్టెలు తింటే చాలు కడుపు నిండుగా ఉన్న భావన కలుగుతుంది. బరువు తగ్గాలనుకునే వారు వీటిని తినడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.
  • జొన్నల్లో ఉండే యాంటీఆక్సిడెంట్లు, ఫైటోకెమికల్స్ శరీరంలో మంటను తగ్గించడంలో సహాయం చేస్తాయి.
  • అలాగే కొలెస్ట్రాల్​ని తగ్గించి గుండె ఆరోగ్యంగా ఉండేలా చేస్తాయి.
  • అందుకే.. జొన్న రొట్టెలను రోజూ ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల గుండె జబ్బుల ప్రమాదం తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు.

NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.