Wednesday, September 25, 2024

తిరుమల లడ్డూ వ్యవహారంలో జగన్‌కు పవన్ క్లీన్ చిట్ - ఢిల్లీ ఎఫెక్ట్..

 


 

తిరుమల శ్రీవారి లడ్డూ తయారీపై నెలకొన్న వివాదం.. రోజుకో మలుపు తిరుగుతోంది. కలియుగ వైకుంఠంలా అలరారుతున్న, సాక్షాత్ శ్రీమహావిష్ణువే కొలువుదీరిన తిరుమలపై, అక్కడి పవిత్రతపై, స్వామివారి లడ్డూ ప్రసాదంపై వివాదం చెలరేగడం అటు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

 

కోర్టుకూ వెళ్లారు..

కోట్లాదిమంది హిందువులు, శ్రీవారి భక్తుల మనోభావాలతో ముడిపడి ఉన్న అంశం కావడం వల్ల అటు జాతీయ మీడియా సైతం దీనికి అత్యధిక ప్రాధాన్యతను ఇచ్చింది. పలువురు జాతీయ స్థాయి నాయకులు దీనిపై స్పందించారు. ఈ ఆరోపణల వెనుక గల వాస్తవాలను వెలికి తీయాలంటూ సుప్రీంకోర్టునూ ఆశ్రయించారు.

లడ్డూపైనే..

తిరుమల లడ్డూ ప్రసాదాన్ని నాసిరకంగా తయారు చేస్తోన్నారని, నాణ్యత రహితమైన వస్తువులను వినియోగిస్తోన్నారంటూ చంద్రబాబు రెండు రోజుల కిందట ఆరోపించిన విషయం తెలిసిందే. నెయ్యికి బదులు జంతువుల కొవ్వును వాడారంటూ.. గత వైఎస్ జగన్ ప్రభుత్వంపై ఘాటు ఆరోపణలు చేశారు. ఈ విమర్శలు- సరికొత్త వివాదానికి తెర తీసినట్టయింది.

 

దీక్షలు..యజ్ఞాలు

స్వయానా ముఖ్యమంత్రి స్థాయి నాయకుడు ఇలాంటి ఆరోపణలు చేయడం ప్రపంచవ్యాప్తంగా హిందూ సమాజాన్ని దిగ్భ్రాంతికి గురి చేశాయి. టీడీపీ కూటమి భాగస్వామ్య పక్షం జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఏకంగా ప్రాయశ్చిత్త దీక్షను స్వీకరించారు. అటు తిరుమలలో మహా సంప్రోక్షణ చేపట్టారు. ఇందులో భాగంగా యజ్ఞయాగాదులను నిర్వహించారు టీటీడీ అధికారులు.

 

తిప్పికొట్టిన వైసీపీ..

తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం చేస్తోన్న ఈ ఆరోపణలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తిప్పి కొడుతున్నారు. సీబీఐతో విచారణ జరిపించాలంటూ డిమాండ్ చేస్తోన్నారు. తాను తప్పు చేయలేదంటూ టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తిరుమల శ్రీవారి ఆలయం ఎదురుగా ప్రమాణం చేయడం- అనుకోని మలుపు.

జగన్‌పై పవన్..

ఈ పరిణామాల మధ్య పవన్ కల్యాణ్- చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. తిరుమల లడ్డూ ఆరోపణల్లో వైఎస్ జగన్‌కు క్లీన్ చిట్ ఇచ్చారు. ఈ వ్యవహారంలో తాము జగన్‌ను తప్పు పట్టట్లేదని పవన్ కల్యాణ్ తేల్చి చెప్పారు. ఆయన సారథ్యంలో ఏర్పాటైన టీటీడీ బోర్డు సభ్యులే ఈ పని చేశారని స్పష్టం చేశారు. వారిని జగన్ రక్షించే ప్రయత్నం చేస్తోన్నారని పేర్కొన్నారు.