ఈ ఏడాది జరగనున్న డీఎస్సీ, టెట్ ఒకేసారి నిర్వహిస్తామని ఆంధ్రప్రదేశ్ మాననవనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. గురుపూజోత్సవం రోజైన సెప్టెంబర్ 5న డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు తెలిపారు. సెప్టెంబర్ 3న న్యూఢిల్లీలో అన్ని రాష్ట్రాల మంత్రుల సమావేశంలో పాల్గోనున్నట్లు గంటా శ్రీనివాసరావు తెలిపారు. సెప్టెంబర్ 5వ తారీఖున విజయవాడలో అధికారకంగా ఉపాధ్యాయ దినోత్సవాన్ని నిర్వహిస్తామని తెలిపారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 10,500 ఉపాధ్యాయ పోస్టులన్నాయి. ప్రభుత్వ పాఠశాల్లో విద్యార్దులు, ఉపాధ్యాయులు స్కూలుకి హాజరవుతున్న విషయాన్ని ఖచ్చితంగా పర్వవేక్షించడానికి బయోమెట్రిక్ విధానాన్ని అమలు చేయనున్నట్లు తెలిపారు. ఈ బయోమెట్రిక్ విధానాన్ని మొదటగా పశ్చిమగోదావరి జిల్లాలో ప్రారంభిస్తామన్నారు. వీడియో, ఆడియో ద్వారా పాఠ్యాంశాల బోధిస్తామన్నారు. ప్రతి 10 గ్రామాలకు ఒక క్లస్టర్ స్కూల్ ను ఎంపిక చేసి ఆ పాఠశాలలో విద్యకు సంబంధించిన అవగాహన, శిక్షణ కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు ప్రకటించారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వం పాఠశాలల పనితీరు కార్పోరేట్ పాఠశాలలకు మించి ఉండేలా చర్యలు తీసుకుంటామన్నారు. రాష్ట్రంలో కొత్తగా 17 విశ్వవిద్యాలయాల ఏర్పాటుకు ప్రతిపాదనలు కేంద్రానికి పంపామన్నారు.