Tuesday, August 6, 2024

TG DSC 2024 Results : ఆలోపే తెలంగాణ 'డీఎస్సీ' ఫలితాలు..!

 


  తెలంగాణ డీఎస్సీ పరీక్షలు పూర్తి కానున్నాయి.  జులై 18వ తేదీన ప్రారంభమైన ఈ పరీక్షలు రేపటితో (ఆగస్టు 5) అన్ని సబ్జెక్టుల పరీక్షలు ముగుస్తాయి. ఈ నేపథ్యంలో ఫలితాలపై విద్యాశాఖ ఫోకస్ పెట్టింది. సాధ్యమైనంత త్వరగా కొత్త టీచర్ల సేవలను వాడుకోవాలన్న ఉద్దేశ్యంతో ప్రభుత్వం ఉంది.

ఈ క్రమంలోనే…. డీఎస్సీ పరీక్షల ప్రాథమిక కీ లను వెంటనే అందుబాటులోకి తీసుకురావాలని విద్యాశాఖ చూస్తోంది. అభ్యర్థుల నుంచి అభ్యంతరాలను స్వీకరించి.. ఆ తర్వాత తుది కీని ప్రకటించనుంది. అనంతరం జనరల్ ర్యాకింగ్ లిస్టును ప్రకటించనుంది.  సర్టిఫికెట్ వెరిఫికేషన్ తర్వాత… నియామక పత్రాలను అందజేయనుంది. ఈ ప్రక్రియ అంతా కూడా ఆగస్టు చివరి వారంలోపే పూర్తి చేయాలని భావిస్తోంది.

డీఎస్సీ పరీక్షల ఫలితాలను త్వరగా విడుదల చేయాలనే యోచనలో విద్యాశాఖ ఉంది. సెప్టెంబరు 5న ఉపాధ్యాయ దినోత్సవం ఉంది. ఈ సందర్భంగానే ఎంపికైన వారికి నియామక పత్రాలు అందజేయాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవలే ఉపాధ్యాయ సంఘాల నేతలు ప్రభుత్వ సలహాదారుడు వేం నరేందర్ రెడ్డితో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ఉపాధ్యాయుల సమస్యలతో పాటు కొత్త టీచర్ల నియామకాలపై కూడా చర్చ జరిగింది. ఉపాధ్యాయ దినోత్సవంలోపు రిక్రూట్ మెంట్ పూర్తి అవుతుందన్న విషయం చర్చకు వచ్చింది.

నిజానికి డీఎస్సీ పరీక్షలను వాయిదా వేయాలని పలువురు అభ్యర్థులు కోరినప్పటికీ ప్రభుత్వం వెనకడుగు వేయలేదు. గ్రూప్స్ పరీక్షలపై నిర్ణయం తీసుకున్నప్పటికీ… డీఎస్సీ పరీక్షలను యథావిథిగా నిర్వహించింది. నిర్ణయించిన షెడ్యూల్ లోపే పరీక్షలను పూర్తి చేసి… కొత్త టీచర్ల రిక్రూట్ మెంట్ ప్రక్రియను పూర్తి చేయాలని భావించింది. మొత్తంగా చూస్తే… ఈ నెలాఖారులోపే ఫలితాలు వచ్చే అవకాశం కనిపిస్తోంది.