Wednesday, August 21, 2024

JioTV+: సెట్‌టాప్‌- బాక్స్‌ అవసరం లేదిక.. స్మార్ట్‌టీవీల్లోనే జియోటీవీ+ సేవలు

 


JioTV+ | ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రముఖ టెలికాం సంస్థ రిలయన్స్‌ జియో (Jio) తన జియో టీవీ+ (JioTV+) సేవలను విస్తృతం చేసింది. ఇప్పటివరకు జియో ఫైబర్‌, జియో ఎయిర్‌ఫైబర్‌ కనెక్షన్లు తీసుకున్న వినియోగదారులకు సెట్‌-టాప్‌ బాక్స్‌లో ఈ యాప్‌ అందుబాటులో ఉండేది. ఇకపై ఆండ్రాయిడ్‌, యాపిల్, అమెజాన్‌ ఫైర్‌ ఓస్‌లోనూ జియో టీవీ+ సేవలు అందుబాటులోకి తీసుకొచ్చింది. దీంతో సబ్‌స్క్రైబర్లు సింగిల్‌ లాగిన్‌తో 800 డిజిటల్‌ ఛానెళ్లను వీక్షించొచ్చని జియో ఓ ప్రకటనలో తెలిపింది.

దాదాపు అన్ని స్మార్ట్‌టీవీ ప్లాట్‌ఫామ్స్‌లోనూ జియో టీవీ+ సేవలు లభిస్తాయని జియో తెలిపింది. తద్వారా న్యూస్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌, మ్యూజిక్‌ విభాగాలకు చెందిన ఛానెళ్లను వీక్షించొచ్చని పేర్కొంది. జియో సినిమా ప్రీమియం, డిస్నీ+ హాట్‌స్టార్‌, సోనీలివ్‌, జీ5 వంటి ఓటీటీ యాప్స్‌ను కూడా వినియోగించొచ్చని తెలిపింది. ఇందుకోసం ఆండ్రాయిడ్ టీవీల్లో గూగుల్‌ ప్లే స్టోర్‌ నుంచి జియో టీవీ+ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాల్సి ఉంటుంది. జియో ఫైబర్‌, జియో ఎయిర్‌ ఫైబర్‌ సబ్‌స్క్రైబర్లు ఈ యాప్‌ ద్వారా కంటెంట్‌ను వీక్షించొచ్చు.

జియో ఎయిర్‌ఫైబర్‌ వినియోగదారులకు అన్ని ప్లాన్లపైనా, జియో ఫైబర్‌ పోస్ట్‌పెయిడ్‌ అయితే రూ.599, రూ.899 ఆ పై ప్లాన్లు తీసుకున్న వారు ఈ యాప్‌లో లాగిన్‌ అవ్వొచ్చు. జియో ఫైబర్‌ ప్రీపెయిడ్‌ యూజర్లు అయితే రూ.999 లేదా అంతకంటే ఆపై ప్లాన్లు కలిగి ఉండాలి. ఎల్‌జీ ఓఎస్‌ ఆధారిత టీవీలకు త్వరలో ఈ యాప్‌ సపోర్ట్ అందిస్తామని జియో తెలిపింది. శాంసంగ్‌ స్మార్ట్‌టీవీ యూజర్లు ఈ యాప్‌ను వినియోగించలేరు. అలాంటి వారు సెట్‌-టాప్‌ బాక్స్‌ను కొనుగోలు చేయాల్సి ఉంటుంది.