Thursday, August 22, 2024

స్టూడెంట్స్​కు రూ.6 లక్షలు సాయం- రిలయన్స్ స్కాలర్‌షిప్​కు అప్లై చేసుకోండిలా!

 


Reliance Foundation Scholarships 2024-25 : రిలయన్స్ ఫౌండేషన్ స్కాలర్‌షిప్‌ ప్రోగ్రామ్ ద్వారా 2024-25 సంవత్సరానికి ఉపకార వేతనాల దరఖాస్తులను ఆహ్వానించింది. దీనిలో భాగంగా 5100 మంది అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థులను ఎంపిక చేయనుంది. ఈ స్కాలర్‌షిప్‌కు దరఖాస్తు చేసుకునేందుకు ఆఖరి తేదీ ఎప్పుడు? అప్లై ఎలా చేసుకోవాలి? అభ్యర్థుల ఎంపిక ఎలా? ఈ స్టోరీలో తెలుసుకుందాం.

పేద విద్యార్థులకు అండ
దేశంలోని 5,100 మంది అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థులకు రిలయన్స్ ఫౌండేషన్ స్కాలర్‌షిప్‌లు ఇవ్వనుంది. 2024-25 విద్యా సంవత్సరానికి దరఖాస్తులను ప్రారంభించింది. రిలయన్స్ ఫౌండేషన్ కొన్నేళ్లుగా ఈ స్కాలర్‌షిప్‌ ప్రోగ్రామ్‌ను కొనసాగిస్తోంది. దేశంలోని అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థులు రిలయన్స్ ఫౌండేషన్ స్కాలర్‌షిప్‌ ప్రోగ్రామ్​కు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.

భారత్​లోనే అతిపెద్ద ప్రైవేట్ స్కాలర్‌షిప్‌ ప్రోగ్రామ్స్​లో ఒకటి
అండర్ గ్రాడ్యుయేట్ కళాశాల విద్యకు సంబంధించిన మెరిట్-కమ్-మీన్స్ ప్రమాణాల ఆధారంగా 5,000 మంది ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ఉపకార వేతనాలు ఇస్తారు. ఆర్థిక భారం లేకుండా చదువును కొనసాగించడానికి అవకాశం కల్పిస్తారు. రిలయన్స్ ఫౌండేషన్ పోస్ట్ గ్రాడ్యుయేట్ స్కాలర్‌షిప్‌ ఇంజినీరింగ్, టెక్నాలజీ, ఎనర్జీ, లైఫ్ సైన్సెస్‌లో ప్రతిభావంతులైన 100 విద్యార్థులను ఎంపిక చేసి ఇస్తారు. అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థులకు రూ.2 లక్షలు, పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థులకు రూ.6 లక్షలుగా స్కాలర్‌షిప్‌ను నిర్ణయించారు. ఇప్పటి వరకు రిలయన్స్ 23,000 ఉన్నత విద్యా స్కాలర్‌షిప్‌లను అందించింది. భారత్​లోనే అతిపెద్ద ప్రైవేట్ స్కాలర్‌షిప్‌ ప్రోగ్రామ్స్​లో ఒకటిగా రిలయన్స్ ఫౌండేషన్ స్కాలర్‌షిప్‌ నిలిచింది.

దరఖాస్తు చేసుకోవడం ఎలా?
రిలయన్స్ ఫౌండేషన్ స్కాలర్‌షిప్‌ దరఖాస్తును www.scholarships.reliancefoundation.org. వెబ్ సైట్ ద్వారా ఆన్‌ లైన్​లో చేసుకోవచ్చు. ఎంపిక ప్రక్రియలో అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థి ఆప్టిట్యూడ్, ఆర్థిక నేపథ్యాన్ని చూస్తారు. పోస్ట్ గ్రాడ్యుయేట్ స్కాలర్‌షిప్‌ కోసం అకడమిక్ అచీవ్‌ మెంట్స్, వ్యక్తిగత వివరాలు, ఇంటర్వ్యూలు వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుంటారు. ఇలా దేశవ్యాప్తంగా ప్రతిభ గల విద్యార్థులను ఎంపిక చేస్తారు. రిలయన్స్ ఫౌండేషన్ స్కాలర్‌షిప్‌ దరఖాస్తులకు చివరి తేదీ 2024 అక్టోబర్ 6.

విద్యార్హతలు
దేశంలోని ఏదైనా గుర్తింపు పొందిన ఉన్నత విద్యా సంస్థలో ఈ ఏడాది ఏదైనా కోర్సులో చేరిన మొదటి సంవత్సరం/ సెమిస్టర్ విద్యార్థులు ఈ స్కాలర్‌షిప్‌ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. పీజీ కోర్సులు చదివేవారికి సైతం స్కాలర్‌షిప్‌ ఇవ్వనున్నారు. రిలయన్స్ ఫౌండేషన్ అధికారిక వెబ్‌సైట్​లో మరింత సమాచారం పొందవచ్చు.