Friday, March 18, 2022

యుక్రెయిన్: పుతిన్‌కు ఏం కావాలి? ఇప్పుడు రష్యా ఏం చేస్తుంది?

 యుక్రెయిన్‌పై దాడితో యూరప్‌లో శాంతికి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ విఘాతం కలిగించారు.



4.4 కోట్ల మంది నివసించే తూర్పు యూరప్ దేశమైన యుక్రెయిన్‌.. పశ్చిమ దేశాల వైపు మొగ్గు చూపడంతో తమ సార్వభౌమత్వానికి ముప్పు ఉందని చెబుతూ పుతిన్ ఈ దాడికి ఆదేశాలిచ్చారు.

దీంతో బాంబు దాడులు మొదలయ్యాయి. వీటిలో వేల మంది మరణించారు. లక్షల మంది శరణార్థులుగా పొరుగు దేశాలకు వలసపోతున్నారు.

ఇంతకీ రష్యా ఎందుకు ఈ దాడులు చేపడుతోంది? పుతిన్‌ డిమాండ్లు ఏమిటి?

పుతిన్‌కు ఏం కావాలి?


దాడికి ఆదేశాలిచ్చే సమయంలో పుతిన్ పెట్టుకున్న లక్ష్యాలు నీరుగారిపోయినట్లు కనిపిస్తున్నాయి. ఈ దాడితో తేలిగ్గానే యుక్రెయిన్‌పై పట్టు సాధిస్తామని ఆయన భావించారు.

ఈ దాడిని యుద్ధం లేదా దండయాత్ర లేదా అతిక్రమణగా అభివర్ణించడానికి పుతిన్ నిరాకరించారు. దీన్ని ''ప్రత్యేక మిలిటరీ ఆపరేషన్''గా ఆయన అభివర్ణించారు.

అయితే, రష్యా చరిత్రలో ఇది కీలక ఘట్టమని ఆయన భావిస్తున్నట్లు ఆయన చర్యలతో సుస్పష్టం అవుతోంది. ''రష్యా భవిష్యత్తుతోపాటు ప్రపంచంలో రష్యా స్థానం ప్రమాదంలో పడ్డాయి''అని రష్యా విదేశీ గూఢచర్య సంస్థ అధిపతి సెర్జీ నారిష్కిన్ వ్యాఖ్యానించారు.

రష్యా నాయకుల తొలి లక్ష్యం యుక్రెయిన్‌పై పట్టు సాధించి, అక్కడి ప్రభుత్వాన్ని కూలదోయడం. పశ్చిమ దేశాల నాటో కూటమిలో యుక్రెయిన్‌ చేరకుండా అడ్డుకోవాలని రష్యా భావించింది.

యుక్రెయిన్‌లో నిస్సైనికీకరణ, ''నాజీ విధాన రహిత'' యుక్రెయినే తమ లక్ష్యమని రష్యా ప్రజలకు పుతిన్ చెప్పారు. యుక్రెయిన్ ప్రభుత్వం చేతిలో అణచివేత, వేధింపులను ఎదుర్కొంటున్న ప్రజలను రక్షించడానికే తాము ఈ దాడులు చేస్తున్నామని వివరించారు.

''యుక్రెయిన్ భూభాగాన్ని ఆక్రమించాలని మేం అనుకోవట్లేదు. మేం బలవంతంగా ఏదీ చేయాలని భావించట్లేదు''అని పుతిన్ చెప్పారు.

''కానీ, నిజానికి అక్కడ నాజీలు లేరు. అణచివేతలు జరగడంలేదు. రష్యా మాత్రం డజన్ల కొద్దీ నగరాల్లో తమ బలాన్ని ప్రయోగిస్తోంది. దీనిపై యుక్రేనియన్లు పోరాడుతున్నారు''అని నిపుణులు విశ్లేషిస్తున్నారు.

ప్రస్తుతం చాలాచోట్ల బాంబు దాడులు కొనసాగుతున్నాయి. అయితే, ఇప్పుడు అక్కడి ప్రభుత్వాన్ని కూలదోయాలని రష్యా అనుకోవడం లేదని శాంతి చర్చలను గమనిస్తే తెలుస్తుంది. తటస్థ యుక్రెయినే లక్ష్యంగా రష్యా ముందుకు వెళ్తోంది.



 తటస్థ యుక్రెయిన్ ఎందుకు కోరుకుంటున్నారు?

1991లో సోవియట్ యూనియన్ కుప్పకూలిన తర్వాత యుక్రెయిన్‌కు స్వాతంత్ర్యం వచ్చింది. అప్పటినుంచి క్రమంగా పశ్చిమ దేశాల వైపుగా యుక్రెయిన్ కదులుతూ వెళ్తోంది. ఐరోపా యూనియన్‌తోపాటు నాటోలో చేరేందుకు కూడా యుక్రెయిన్ ప్రయత్నించింది.

యుక్రెయిన్ చర్యలను మళ్లీ వెనక్కి తీసుకునేలా చేయాలని పుతిన్ భావిస్తున్నారు. సోవిట్ యూనియన్ పతనాన్ని రష్యా విచ్ఛిన్నంగా ఆయన భావిస్తున్నారు.

రష్యన్లు, యుక్రేనియన్లు ఒకే జాతి ప్రజలని, యుక్రెయిన్ ఏనాడూ స్వతంత్ర దేశంగా లేదని పుతిన్ చెబుతుంటారు. యుక్రేనియన్ చరిత్రను ఆయన తిరస్కరిస్తుంటారు.

2013లో యూరోపియన్ యూనియన్‌లో చేరే ఒప్పందాన్ని రష్యా అనుకూల యుక్రెయిన్ నాయకుడు విక్టర్ యనుకోవిచ్‌తో పుతిన్ పక్కన పెట్టించేశారు. దీంతో ఫిబ్రవరి 2014లో యుక్రెయిన్ వ్యాప్తంగా నిరసనలు పెల్లుబికాయి.

వీటిపై స్పందిస్తూ దక్షిణ యుక్రెయిన్‌లోని క్రైమియా పీఠభూమిని రష్యా స్వాధీనం చేసుకుంది. యుక్రెయిన్ బలగాలతో పోరాడుతున్న క్రైమియాలోని వేర్పాటువాదులకు రష్యా అండగా నిలిచింది. ఎనిమిదేళ్లపాటు కొనసాగిన యుద్ధంలో దాదాపు 14,000 మంది మరణించారు.

2015లో ఇక్కడ మిన్స్క్‌ శాంతి ఒప్పందం కుదిరింది. అయితే, ఇది అమలుకు నోచుకోలేదు. యుక్రెయిన్‌పై తాజా దాడికి ముందుగా, ఈ ఒప్పందానికి పుతిన్ తూట్లు పొడుస్తూ.. రష్యన్ జనాభా ఎక్కువగా ఉండే రెండు తూర్పు ప్రాంతాలను స్వతంత్ర ప్రాంతాలుగా గుర్తించారు.

తమ దేశ భవిష్యత్తుకు నాటోతో ముప్పు ఉందని చెబుతూ యుక్రెయిన్‌పైకి పుతిన్ బలగాలను పంపించారు. నాటో దేశాలు క్రైమియాను వెనక్కి తీసుకొనేందుకు ప్రయత్నిస్తున్నాయని ఎలాంటి ఆధారాలు లేకుండానే ఆయన ఆరోపణలు చేశారు.

    రష్యా-యుక్రెయిన్ సంక్షోభం: ఇది మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీస్తోందా
    యుక్రెయిన్ సంక్షోభం: కొన్ని దేశాలు అమెరికాతో జత కట్టకుండా, రష్యా పక్షం వహిస్తున్నాయి ఎందుకు

యుద్ధం ఆపడానికి మార్గం ఉందా?

త్వరలో కాల్పుల విరమణ ఒప్పందం కుదరొచ్చని, ఎందుకంటే రష్యా బలగాలు ముందుకు వెళ్లలేకపోతున్నాయని యుక్రెయిన్ అధ్యక్ష సలహాదారు మిఖాయిలో పొడోలిక్ ఇటీవల వెల్లడించారు.

చర్చల్లో పురోగతి ఉందని రెండు వైపులా అంగీకరిస్తున్నాయి. పుతిన్ వైఖరి మెతకబడిందని పొడోలిక్ తెలిపారు.

దాడి చేసిన తొలి రోజుల్లో క్రైమియా రష్యాలో అంతర్భాగమని యుక్రెయిన్ గుర్తించాలని రష్యా పట్టుబట్టింది. తూర్పు యుక్రెయిన్‌లోని రెండు ప్రాంతాలను స్వతంత్ర ప్రాంతాలుగా గుర్తించాలని నొక్కి చెప్పింది. నాటో, యూరోపియన్ యూనియన్‌లలో చేరబోమని చెబుతూ యుక్రెయిన్ రాజ్యాంగానికి సవరణ చేయాలని సూచించింది.

క్రైమియాతోపాటు రష్యా మద్దతున్న లుహాన్‌స్క్, దోన్యస్క్ ప్రాంతాలపై ఏకాభిప్రాయం కుదిరేలా కనిపించడం లేదు. అయితే, వీటిపై తర్వాత నిర్ణయం తీసుకుంటామని అంగీకారంతో శాంతి ఒప్పందం కుదిరే అవకాశముంది.


 యుక్రెయిన్ నాయకుడ్ని తొలగించి, అతడి స్థానంలో ఓ కీలుబొమ్మ లాంటి మరో నాయకుణ్ని ఏర్పాటు చేయాలనే లక్ష్యం నెరవేరదని రష్యా గ్రహించినట్లే కనిపిస్తోంది. బెలారుస్‌లో అయితే, తమ ఆదేశాలకు అనుగుణంగా నడచుకునే నాయకుణ్ని అధ్యక్షుడిగా రష్యా నియమించగలిగింది.

కానీ, యుక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమీర్ జెలియెన్‌స్కీ మాత్రం.. తనను రష్యా తొలి శత్రువుగా గుర్తించిందని, తన కుటుంబం రష్యాకు రెండో శత్రువని వ్యాఖ్యానించారు.

''ఇప్పుడు పుతిన్ తన డిమాండ్ల సంఖ్య తగ్గించుకున్నట్లు కనిపిస్తోంది''అని ఆర్ పొలిటిక్ అండ్ కార్నెగీ మాస్కో సెంటర్‌కు చెందిన రాజకీయ విశ్లేషకురాలు తాతియానా స్టానోవయా వ్యాఖ్యానించారు.

ఎందుకంటే రష్యా ఇప్పుడు తటస్థ, నిస్సైనికీకర యుక్రెయిన్‌ను కోరుకుంటోంది. సైన్యం, నావికా దళాలను కూడా తమ దళాలనే ఉపయోగించాలని భావిస్తోంది. ఈయూ సభ్య దేశాలైన ఆస్ట్రియా లేదా స్వీడన్ ఇలానే సొంత సైన్యాలు లేకుండా ఉన్నాయి. ఆస్ట్రియా తటస్థ దేశం. స్వీడన్ మాత్రం తటస్థ దేశం కాదు. ఇది నాటో అభ్యాసాల్లోనూ పాలుపంచుకుంటుంది.

రష్యా సానుకూల దృక్పథంతో చర్చలు జరుపుతుందని చాలా మంది భావించడం లేదు. ''మొదట రష్యా కాల్పుల విరమణకు అంగీకరించాలి. ఎందుకంటే తలపై తుపాకీ గురిపెట్టి చర్చలు జరపలేరు''అని ఫ్రాన్స్ విదేశాంగ మంత్రి వ్యాఖ్యానించారు.
యుక్రెయిన్ డిమాండ్లు ఏమిటి?

యుక్రెయిన్ డిమాండ్లు సుస్పష్టంగా ఉన్నాయని ఆ దేశ అధ్యక్ష సలహాదారుడు చెప్పారు. ''కాల్పుల విరమణ, రష్యా బలగాల ఉపసంహరణ లాంటివి మా డిమాండ్లలో ఉన్నాయి''అని ఆయన చెప్పారు.

''యుద్ధానికి మునుపటి స్థానాలకు రష్యా సైన్యం వెళ్లడం కూడా యుక్రెయిన్ డిమాండ్లలో ఒకటి. పశ్చిమ దేశాలు కూడా ఇదే కోరుతున్నాయి''అని ఇంటర్నేషనల్ లా ప్రొఫెసర్, ఐరాస మధ్యవర్తిత్వ నిపుణుడు మార్క్ వెల్లెర్ చెప్పారు.

రష్యా దాడి విషయంలో యుక్రెయిన్ వైఖరి కూడా మెతకబడినట్లు కనిపిస్తోంది. నాటో తమను సభ్య దేశంగా అంగీకరించబోదని ఆ దేశ అధ్యక్షుడు జెలెయెన్స్కీ కూడా వ్యాఖ్యానించారు. ''అదే నిజం. దాన్ని మనం గుర్తించాలి''అని ఆయన వ్యాఖ్యానించారు.

''ఇద్దరు అధ్యక్షులూ అంగీకరించే ఒప్పందంపై మేం చర్చలు జరుపుతున్నాం. త్వరలోనే ఇది పూర్తి కాబోతోంది. యుద్ధాన్ని ఆపడానికి ఇదొక్కటే మా ముందున్న మార్గం''అని పోడోలిక్ వివరించారు.


పుతిన్ అనుకున్నది సాధించగలుగుతారా?

 పశ్చిమ దేశాలతోపాటు 30 దేశాలు సభ్యులుగానున్న నాటో కూటమిపై పుతిన్ వైఖరిలో ఎలాంటి మార్పు లేనప్పటికీ, యుక్రెయిన్ విషయంలో ఆయన రాజీపడే సూచనలు కనిపిస్తున్నాయి. తాజా దాడులకు ముందుగా.. నాటో సైన్యం 1997కు ముందున్న స్థానాలకు వెళ్లిపోవాలని పుతిన్ నొక్కి చెప్పారు. 1997 తర్వాత నాటోలో చేరిన యూరప్ దేశాల సభ్యత్వాన్ని రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. అంతేకాదు తమ సరిహద్దుల్లోని దేశాల్లో ఎలాంటి ఆయుధాలను మోహరించకూడదని ఆయన చెబుతున్నారు. 1990ల్లో తమ సభ్యత్వాన్ని మరిన్ని దేశాలకు విస్తరించబోమని నాటో హామీ ఇచ్చిందని పుతిన్ అంటున్నారు. సోవియట్ యూనియన్ కుప్పకూలకు ముందు, అప్పటి సోవియట్ యూనియన్ అధ్యక్షుడు మిఖాయిల్ గోర్బచేవ్‌కు నాటోకు మధ్య ఆ అంగీకారం కుదిరిందని ఆయన చెబుతున్నారు. అయితే, అలాంటి చర్చలేమీ జరగలేదని పశ్చిమ దేశాలు చెబుతున్నాయి. యూరప్‌ను తన కళ్లతో మాత్రమే పుతిన్ చూడాలని అనుకుంటున్నారని, కానీ, ఇప్పుడు పరిస్థితులు చాలా మారాయని జర్మనీ ఛాన్సెలర్ ఓలాఫ్ స్కాల్జ్ చెప్పారు. మరోవైపు పుతిన్‌ను యుద్ధ నేరస్థుడిగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అభివర్ణించారు. యుద్ధానికి ముందు అమెరికా అణ్వాయుధాలు కేవలం అమెరికా భూభాగాలకే పరిమితం కావాలని రష్యా డిమాండ్ చేసేది. ముఖ్యంగా మధ్యస్థ శ్రేణి క్షిపణులు, ఖండాంతర క్షిపణులపై చర్చలు జరిగాయి. ఇప్పుడు ఆ చర్చలు దాదాపుగా ముగిసిపోయినట్లే. ప్రచ్ఛన్న యుద్ధంనాటి పరిస్థితులు మళ్లీ వచ్చే అవకాశముందని తాతియానా అభిప్రాయం వ్యక్తం చేశారు. ''పశ్చిమ దేశాలకు రష్యా మరింత గట్టి డిమాండ్లు పెట్టే అవకాశముంది. మనం ఊహించిన దానికంటే పరిస్థితులు మరింత దిగజారే ముప్పుంది''అని ఆమె వ్యాఖ్యానించారు. రష్యా - యుక్రెయిన్ యుద్ధం అప్‌డేట్స్: 'మరియుపూల్ వీధుల్లో సేకరించిన మృతదేహాల సంఖ్య 1,207' యుక్రెయిన్, రష్యా యుద్ధంలో Z అక్షరం ఎందుకంత కీలకంగా మారింది? దీనిని ఏ అర్థంలో వాడుతున్నారు రష్యా తర్వాత ఏం చేస్తుంది? ఈ దాడులపై పశ్చిమ దేశాల స్పందన విషయంలో పుతిన్ ఆశ్చర్యానికి గురయ్యారు. పశ్చిమ దేశాలు నేరుగా యుద్ధంలోకి దిగవని పుతిన్‌కు తెలుసు. అయితే, భారీ స్థాయిలో ఆంక్షలు విధిస్తాయని ఆయన ముందుగా ఊహించలేదు. ఈ ఆంక్షలు రష్యా ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతున్నాయి. ఐరోపా యూనియన్‌తోపాటు అమెరికా, బ్రిటన్, కెనడా.. రష్యా ఆర్థిక వ్యవస్థపై భిన్న ఆంక్షలు విధించాయి. రష్యా సెంట్రల్ బ్యాంక్ ఆస్తులను స్తంభింపచేశారు. ఇంటర్నేషనల్ చెల్లింపుల వ్యవస్థ స్విఫ్ట్ నుంచి రష్యన్ బ్యాంకులను కూడా తొలగించారు. రష్యా చమురు, గ్యాస్ సంస్థల దిగుమతులపై అమెరికా నిషేధం విధించింది. ఏడాదిలోనే ఐరోపా యూనియన్ రష్యా గ్యాస్ దిగుమతులను మూడింట రెండొంతులకు తగ్గించాలని లక్ష్యం నిర్దేశించుకుంది. మరోవైపు 2022 చివరినాటికి రష్యా చమురు దిగుమతిని పూర్తిగా నిలిపివేయాలని బ్రిటన్ నిర్ణయించింది. మరోవైపు రష్యా, ఐరోపా యూనియన్ కలిసి నిర్మిస్తున్న నార్డ్ స్ట్రీమ్ గ్యాస్ పైప్‌లైన్ నిర్మాణాన్ని పక్కన పెట్టేస్తున్నట్లు జర్మనీ వెల్లడించింది. ఐరోపా యూనియన్, బ్రిటన్, అమెరికా, కెనడా గగనతలంలో ప్రయాణాలు చేయకుండా రష్యా విమానయాన సంస్థలపై ఆంక్షలు విధించారు. రష్యా అధ్యక్షుడు పుతిన్, విదేశాంగ మంత్రి సెర్జీ లావ్రోవ్ సహా కొందరు కీలక రష్యా నాయకులపై వ్యక్తిగతంగా కూడా ఆంక్షలు విధించారు. శాంతి ఒప్పందంతో ఈ ఆంక్షలను పక్కనపెట్టే సూచనలేవీ కనిపించడం లేదు. ఈ విషయం పుతిన్‌కు కూడా తెలుసు. మరోవైపు యుద్ధాన్ని వ్యతిరేకిస్తున్న రష్యన్లపై ఆయన ఉక్కుపాదం మోపుతున్నారు. ఇప్పటివరకు నిరసన తెలిపిన 15,000 మంది రష్యన్లను అదుపులోకి తీసుకున్నారు. మీడియా గొంతు కూడా నొక్కేశారు. రష్యాలో పుతిన్‌కు వ్యతిరేకంగా ఎలాంటి ప్రతిపక్షమూ లేదు. ప్రతిపక్ష నాయకులు దేశం విడిచి పారిపోయారు. ప్రధాన ప్రతిపక్ష నాయకుడైన అలెక్సీ నావల్నీని జైలుకు పంపించారు.