Thursday, May 6, 2021

కల్యాణానికి కొవిడ్​ నియమం.. ప్రత్యామ్నాయంతో సిద్ధం

 

గత నాలుగు నెలల పాటు సుముహూర్తాలు లేనందున శుభకార్యాలు జరగలేదు. మే నెలలో మంచి రోజులు రావడంతో వివాహాలు, ఇతర శుభాకార్యాలు చేసుకునేందుకు అనేక కుటుంబాలు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాయి. రోజు రోజుకు కరోనా వైరస్‌ విజృంభిస్తుండడంతో ముహూర్తాలు పెట్టుకున్న కుటుంబ సభ్యుల్లో భయాందోళనలు నెలకొన్నాయి. నేటి నుంచి జూన్‌ 26 తేదీ వరకు ముహూర్తాలు ఉన్నాయి. ఉమ్మడి మెదక్‌ జిల్లాతో పాటు వికారాబాద్‌ జిల్లాలో 5 వేలకు పైగా వివాహాలు జరగవచ్చని అంచనా. కొవిడ్‌-19 ఉద్ధృతితో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. కొందరు వివాహాలు వాయిదా వేసుకోగా.. మరి కొందరు సాదాసీదాగా వివాహాలు చేసుకునేందుకు మొగ్గు చూపుతున్నారు. సీజన్‌పై ఆధారపడిన వారు మాత్రం నిరాశగా ఉన్నారు. ఈసారి తమ వ్యాపారాలు దెబ్బతినే అవకాశం ఉందని ఆందోళన చెందుతున్నారు. ఫంక్షన్‌ హాళ్లు కాకుండా ఇళ్లతోనే అతి తక్కువ మంది కుటుంబ సభ్యులు అతిథుల మధ్యనే కొవిడ్‌-19 నిబంధనలు పాటిస్తూ వివాహాలు చేసుకోవాలని పలువురు సూచనలు చేస్తున్నారు.

జూన్‌ 26 వరకు..
ఈ నెల 6 నుంచి జూన్‌ 26 వరకు సుముహూర్తాలు ఉన్నాయి. మే 6, 13, 14, 16, 19, 21, 23, 26, 28, 29, 30, జూన్‌ 3, 4, 5, 20, 21. 24, 26 వరకు కల్యాణ ఘడియలున్నాయి.
మూణ్నెల్ల ముందే..
ఉమ్మడి మెదక్‌ జిల్లాతో పాటు వికారాబాద్‌ జిల్లాలో 5 వేలకు పైగా వరకు వివాహాలు మే, జూన్‌ నెలల్లో జరగనున్నాయని అర్చక, పురోహిత సంఘాల ప్రతినిధులు తెలిపారు. పట్టణ ప్రాంతాల్లో వివాహాలు చేసుకునే వారు ఇప్పటికే ఫంక్షన్‌ హాళ్లు బుక్‌ మూణ్నెల్ల ముందే బుక్‌ చేసుకున్నారు. వీటితో పాటు బాజాభజంత్రీలు, అలంకరణ, టెంట్లు, పురోహితులను అడ్వాన్సులు ఇచ్చి మాట్లాడుకున్నారు. ప్రస్తుతం చాలామంది ఆలోచనలో పడ్డారు.
50 మందికి మించొద్దు..
వివాహాలు, ఇతర వేడుకలు కుటుంబ సభ్యులు, ముఖ్యమైన అతిథులు 50 మందికి మించి పిలవవద్దని అధికారులు పేర్కొంటున్నారు. పెళ్లి కొడుకు, కుతురు ఇద్దరి తరఫున 25 మంది చొప్పున పిలుచుకోవాలి. వివాహ వేడుకలకు సంబంధించి ప్రభుత్వం నుంచి అధికారికంగా ఉత్తర్వులు రానప్పటికీ నాలుగైదు రోజుల్లో వచ్చే అవకాశం ఉందని ఓ తహసీల్దార్‌ ‘న్యూస్‌టుడే’కు తెలిపారు. వివాహం చేసుకునే వారు వధువు, వరుడు, తల్లిదండ్రుల ఆధార్‌ కార్డు, లగ్నపత్రిక, అఫిడవిట్‌తో తహసీల్దార్‌కు సమర్పించాల్సి ఉంటుంది. కల్యాణ మండపాల్లో కరోనా కేసులు నమోదు అయ్యే అవకాశం ఉండటంతో ఇళ్ల వద్దనే అతి కొద్ది మంది కుటుంబ సభ్యుల మధ్యనే వివాహాలు చేసుకోవాలని సూచనలు చేస్తున్నారు.
మాస్కులు, శానిటైజర్లు తప్పనిసరి
వివాహాల్లో మాస్కులు, శానిటైజర్లు తప్పని సరిగా ఉంచాలి. పెళ్లికి వచ్చే వారికి మాస్కులు అందించడంతో పాటు శానిటైజర్లు అందించాలి. వివాహాం చేసుకునే ముందు రోజు రాత్రి పెళ్లి వేదికను పూర్తిగా శానిటరైజ్‌ చేయించాలి. పెళ్లి వచ్చే వారికి శరీర ఉష్ణాగ్రతలను కూడా పరిశీలించాలి. కొంచెం అనుమానం వచ్చిన వారికి వివాహా మండపాలకు రానివ్వవద్దని అధికారులు సూచనలు చేస్తున్నారు.

 

 

రిజిస్ట్రేషన్‌ చట్టబద్ధం
న్యూస్‌టుడే, కంది: ఇంట్లో కొద్ది మంది అతిథుల సమక్షంలో చేసుకున్న తరువాత చట్టబద్ధం చేసుకునేందుకు రిజిస్ట్రేషన్‌ కార్యాలయంలో నమోదు చేసుకోవచ్చు. వివాహం రిజిస్ట్రేషన్‌ చేసుకునేందుకు వివాహ శుభలేఖ, పదో తరగతి మెమో, జనన ధ్రువీకరణ పత్రాలు, వధువు, వరుడు ఆధార్‌ కార్డులు, నివాస ధ్రువీకరణ పత్రం, ముగ్గురు సాక్షులు, సంయుక్త అఫిడవిట్‌ సమర్పిస్తే వివాహాన్ని చట్టబద్ధంగా రిజిస్టర్‌ చేస్తామని అధికారులు వివరించారు. ఉమ్మడి మెదక్‌ జిల్లాతో పాటు వికారాబాద్‌ జిల్లాలో దీనికి సంబంధించి 16 రిజిస్ట్రేషన్‌ కార్యాలయాలు ఉన్నాయి.

గిరాకీలకు దెబ్బ
వివాహాలు నియంత్రణగా జరిగితే వివిధ వర్గాల వారికి ఆర్థికంగా దెబ్బపడే అవకాశం ఉంటుంది. ఈ రోజుల్లో శుభాకార్యం ఏదైన అలంకరణకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. రూ.20 వేల నుంచి రూ.లక్ష వరకు అలంకరణకు ఖర్చు చేస్తున్నారు. వీరిపై కరోనా ప్రభావం పడనుంది. తక్కువ మంది అతిథులతో వివాహాలు చేసుకునేందుకు ఆసక్తి చూపడంతో ప్రైవేట్‌ వాహనాలు బుక్‌ చేయడం లేదు. ఒక్కో రోజుకు పెద్ద వాహనాలకు రూ.2 వేలు, చిన్న వాహనాలకు రూ.వెయ్యి, బత్తా రూ.500 వసూలు చేస్తున్నారు. దూరం, ఉపయోగించుకునే సమయాన్ని బట్టి రుసుము పెరుగుతుంది. ఇలాంటి రంగాల వారు తీవ్రంగా నష్టపోనున్నారు. పూల దుకాణ దారులు కూడా వివాహ సీజన్‌లో రూ.4 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు గిరాకీ కోల్పోతారు.


G
M
T
Text-to-speech function is limited to 200 characters