దిల్లీ: ప్రధాని నరేంద్రమోదీ ఈ వారం బంగ్లాదేశ్ పర్యటన చేపట్టనున్న  నేపథ్యంలో భారత్-బంగ్లాదేశ్ భూ సరిహద్దు ఒప్పందం(ఎల్.బి.ఎ.)పై  రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆమోద ముద్ర వేశారు. పొరుగు దేశంతో సంబంధాలు  బలపరచుకునేందుకు ఇది ఉపకరిస్తుందని భావిస్తున్నారు. సరిహద్దుల్ని కొంతమేర  మార్చుకునేందుకు 1974లోనే ఒప్పందంపై సంతకాలు జరిగాయి. బంగ్లాదేశ్  పార్లమెంటు దీనికి వెంటనే ఆమోదం తెలపగా, భారత పార్లమెంటు మాత్రం గత నెలలోనే  ఆమోదించింది. ఇది రాజ్యాంగ సవరణ బిల్లు అయినప్పటికీ 50% రాష్ట్రాల  శాసనసభలు ఆమోదం తెలపాలనే నిబంధన దీనికి వర్తించదని అధికార వర్గాలు  తెలిపాయి. సరిహద్దుల్ని నిర్ణయించుకోవడంతో పాటు భారత్ నుంచి బంగ్లాదేశ్‌కు  17,160 ఎకరాల భూమి బదలాయింపునకు ఒప్పందం వీలు కల్పిస్తుంది. బంగ్లాదేశ్  నుంచి భారత్‌కు 7110 ఎకరాల భూమి లభిస్తుంది.