Monday, March 2, 2015

కొత్తగా ఆలోచించండి




 సైబర్ భద్రతపై ప్రపంచ దేశాలన్నీ ఆందోళన చెందుతున్నాయి -హ్యాకర్ల ఆటకట్టించేలా వినూత్న అప్లికేషన్లు అభివృద్ధి చేయండి -డేటా స్టోరేజ్ కోసం క్లౌడ్ గోడౌన్లు, లాకర్లను డిజైన్ చేయాలి.. -ప్రధాని కార్యాలయం కోసం త్వరలో ప్రత్యేక మొబైల్ అప్లికేషన్ -నాస్కామ్ సదస్సులో ప్రధాని మోదీ న్యూఢిల్లీ, మార్చి 1:సైబర్ భద్రత అంశం ప్రపంచవ్యాప్తంగా ఆందోళన కల్గిస్తున్నదని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఈ సమస్యను అరికట్టేలా, హ్యాకర్ల ఆటకట్టించేలా వినూత్న అప్లికేషన్లను అభివృద్ధి చేయాలని ఆదివారం జరిగిన నాస్కామ్ సదస్సులో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ(ఐటీ) రంగ ప్రతినిధులను ఆయన కోరారు. అంతేకాదు ఐటీ నిపుణులు కొత్తగా ఆలోచించాలని ఆయన సూచించారు. భారీగా సమచారాన్ని భద్రపర్చుకునేందుకు వీలుగా పటిష్ఠ భద్రతో కూడిన క్లౌడ్ గోడౌన్లు, క్లౌడ్ లాకర్లను డిజైన్ చేయాలని మోదీ కోరారు. తద్వారా బ్యాంకులు, ఇతర సంస్థలు వీటిని అద్దెకు తీసుకొని డేటా స్టోరేజ్ అవసరానికి వాడుకునేందుకు వీలవుతుందన్నారు. ప్రధాని అయ్యాక దాదాపు 50 మంది ప్రపంచ స్థాయి నేతలతో భేటీ అయినట్లు, అందులో 25-30 మంది సైబర్ భద్రత ఆందోళన వ్యక్తం చేసినట్లు తన ప్రసంగంలో పేర్కొన్నారు. అలాగే ప్రజలకు మొబైల్ ద్వారా దగ్గరయ్యేలా ప్రధాన మంత్రి కార్యాలయం(పీఎంవో) కోసం ప్రత్యేకంగా మొబైల్ అప్లికేషన్‌ను రూపొందించాలనుకుంటున్నట్లు మోదీ వెల్లడించారు. దీని డిజైన్ ఐడియాలను ప్రజల నుంచే కోరాలనుకుంటున్నట్లు ఆయన చెప్పారు. ఇందుకోసం mygov.in ద్వారా పోటీ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఐటీ సైబర్ సెక్యూరిటీ అప్లికేషన్లు, సాఫ్ట్‌వేర్ల విభాగం అతిపెద్ద మార్కెట్‌గా మారిందన్నారు. దేశీయ ఐటీ నిపుణులు ఈ అవకాశాలను వినియోగించుకొని ప్రపంచవ్యాప్తంగా సేవలందించే దిశగా కృషి చేసేందుకు ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేయాలని నాస్కామ్‌ను కోరారు. సరైన భద్రత కల్పించకపోతే తమ వ్యక్తిగత సమాచారం చౌర్యానికి గురవుతుందని ప్రజలు మొబైల్ వాడేందుకూ భయపడాల్సి రావచ్చని ప్రధాని ఆందోళన వ్యక్తం చేశారు. బడ్జెట్లో గోల్డ్ బాండ్లు జారీ చేయనున్నట్లు ప్రకటించిన విషయాన్ని ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఈ బాండ్ల ద్వారా మార్కెట్లో బంగారం కొనుగోలు చేయనవసరం లేకుండా నిల్వ చేసుకునే వీలుంటుందన్నారు. క్లౌడ్ లాకర్లను డిజైన్ చేస్తే బాండ్లను అందులో భద్రపర్చుకునేందుకు వీలవుతుందన్నారు. మొబైల్ గవర్నెన్స్ సేవలకవసరమైన అప్లికేషన తయారీకి సంబంధించి దేశీయ ఐటీ ఇండస్ట్రీకి అపారమైన అవకాశాలున్నాయన్నారు. టెక్నాలజీ ఉపయోగించుకోవడం ద్వారా ప్రభుత్వం అవినీతిని ఎలా అరికట్టగలుగుతుందనడానికి ఎల్‌పీజీ సబ్సిడీకి నగదు బదిలీ పథకం, బొగ్గు గనుల ఈ-వేలం మంచి ఉదాహరణలని ప్రధాని పేర్కొన్నారు. వంటగ్యాస్ సబ్సిడీ జారీకి నగదు బదిలీ విధానాన్ని అనుసరించడం ద్వారా 10 శాతం లీకేజీకి అడ్డుకట్ట వేయగలిగామని, ఫలితంగా కేంద్రానికి వేల కోట్లు ఆదా అవుతున్నట్లు మోదీ చెప్పారు. అలాగే బొగ్గు గనుల కుంభకోణంతో 1.86 లక్షల కోట్ల ఆదాయానికి గండిపడిందని కాగ్ పేర్కొంది. కానీ ఈ స్కాంకు సంబంధించి సుప్రీంకోర్టు రద్దు చేసిన 204 గనుల్లో కేవలం 19 బ్లాకులను ఎలక్ట్రానిక్ పద్ధతిలో వేలం వేయడం ద్వారా రూ.1.10 లక్షల కోట్ల ఆదాయం సమకూరిందన్నారు. ప్రభుత్వ యంత్రాంగంలో సాంకేతిక పరిజ్ఞానం పారదర్శకత పెంచగలదనడానికిదే మంది ఉదాహరణ అని అన్నారు. వర్చువల్ మ్యూజియమ్‌లను ఏర్పాటు చేయడం ద్వారా మన ఐటీ రంగం దేశంలో పర్యాటకానికి ఊతమివ్వగలదని ప్రధాని అన్నారు. స్కూళ్లకు ఈ-లైబ్రరీలు ఏర్పాటు చేయాలని ఇండస్ట్రీ వర్గాలను కోరారు. దేశంలో ఆర్థిక వృద్ధిరేటును పెంచడంలో డిజిటల్ కనెక్టివిటీ కూడా ప్రధాన వనరుగా మారిందన్నారు. కానీ భారత్‌లో గూగుల్ లాంటి దిగ్గజ సంస్థను ఎందుకు ఏర్పాటు చేయలేకపోయారని ఇండస్ట్రీ ప్రతినిధులను ఆయన ప్రశ్నించారు. ప్రస్తుతం 14,600 కోట్ల డాలర్ల స్థాయికి చేరుకున్న ఇండియన్ ఐటీ సెక్టార్ ఇకపై అప్లికేషన్లు(యాప్) అభివృద్ధిపైనా దృష్టిసారించాలన్నారు. ఇండస్ట్రీ ఎంత తొందరగా మొబైల్ అప్లికేషన్లను డిజైన్ చేయగలిగితే.. అంతే తొందరగా మార్కెట్ వాటాను పెంచుకోగలదన్నారు. ప్రభుత్వ ఐటీ ప్రాజెక్టుల్లో భాగస్వాములమవుతాం: నాస్కామ్ విద్య, ఇంధనశక్తి, ఆహారం, యంత్రాంగ నిర్వహణ, ఆరోగ్య సంరక్షణ, మౌలిక సదుపాయాల రంగాల్లో ప్రభుత్వం చేపట్టబోయే ఐటీ ప్రాజెక్టుల్లో తామూ భాగస్వామ్యులం కావాలనుకుంటున్నట్లు ఐటీ రంగ అసోసియేషన్ నాస్కామ్ వెల్లడించింది. ఈ ఆరు విభాగాల్లో ప్రభుత్వంతో కలిసి పనిచేయాలనుకుంటున్నట్లు ఈ సదస్సులో టీసీఎస్ సీఈవో, ఎండీ ఎన్ చంద్రశేఖర్ అన్నారు.