Sunday, February 8, 2015

ప్రమాదంలో పత్రికాస్వేచ్ఛ


ప్రజాస్వామ్య వ్యవస్థ మనుగడకు పత్రికా స్వాతంత్య్రం అత్యంత కీలకమైనది. వాస్తవాలను తెలుసుకొనే హక్కు ప్రజలందరికీ ఉంటుంది. అయితే పాలకులు- ఎవరైనా- తాము చెప్పదలచుకున్నది మాత్రమే ప్రజలు తెలుసుకోవాలని, తమను ఇబ్బందుల్లో పడేసే అంశాలు ప్రజల దృష్టిలో పడకూడదని తాపత్రయపడుతుంటారు. అటువంటి పరిస్థితులలో వాస్తవాలను వెలుగులోకి తేవాలని ప్రయత్నించే పత్రికలు, పత్రికా రచయితలు దాడులకు, ఆంక్షలకు, నిర్బంధాలకు గురికావలసి వస్తున్నది. అదే విధంగా ప్రభుత్వ అధికారులుగా ఉంటూ నిజాయితీగా తమ బాధ్యతలను నెరవేర్చాలనుకొనే వారిపట్ల సైతం పాలకులు అసహనం వ్యక్తం చేస్తుంటారు. ప్రజలకు మేలయిన పరిపాలన అందించాలనుకునే పాలకులు ఒక వంక పత్రికా స్వాతంత్య్రాన్ని కాపాడుతూ, మరో వంక నిజాయితీపరులైన అధికారులకు రక్షణ కల్పించాలి. ఈ అంశంపై వారు చూపే శ్రద్ధనుబట్టి ఇక ప్రభుత్వం ఏమేరకు సుపరిపాలన అందించడానికి ప్రయత్నిస్తున్నదో అంచ నా వేయవచ్చు. పత్రికా స్వాతంత్య్రం అంటే జరిగిన సంఘటనలను నివేదించడం మాత్రమే కాదు. పరిశోధనాత్మక రచనలు చేయడం సైతం అత్యవసరం. అత్యవసర పరిస్థితి కాలంలో దేశంలో పత్రికలపై సెన్సార్‌షిప్ అమలుపరచిన సమయంలో ఒపీనియన్, ఇండియన్ ఎక్స్‌ప్రెస్ వంటి పత్రికలు ప్రదర్శించిన ధైర్యసాహసాలు ప్రపంచ దృష్టిని ఆకర్షించాయి. ప్రపంచ వ్యాప్తంగా మొదటగా సంచలనం కల్గించిన ఉదంతం అమెరికాలోని వాటర్‌గేట్ కుంభకోణం. దీనికి సంబంధించిన పరిశోధనాత్మక పత్రికా కథనాలు ప్రపంచవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించాయ. ప్రపంచం అంతటా అప్పటి వాషింగ్టన్ పోస్ట్ సంపాదకులు బెంజిమిన్ సి.బ్రాడ్లీ పాత్రికేయులకు ఎల్లకాలం ఆదర్శంగా నిలుస్తారు. ఇటీవలనే ఆయన మృతి చెందారు. వృత్తిపరమైన బాధ్యతలు నిర్వహిస్తున్న పాత్రికేయులు, అధికారులపై మన దేశంలో తరచూ అసహనం పెరిగిపోతున్నది. వారు దాడులకు, వేధింపులకు గురవుతున్నారు. కేవలం తమ కింద అణిగిమణిగి ఉండి, తాము చెప్పినట్టు తలాడించే అధికారులను వారి సామర్థ్యం, సీనియారిటీలతో సంబంధం లేకుండా కీలక పదవులలో నియమిస్తూ ఉండటం చూస్తున్నాము. ఇటీవలనే హర్యానాలో వివాదాస్పదమైన తన భూముల కొనుగోళ్ళ వ్యవహారం గురించి రాబర్ట్ వాద్రాను ప్రశ్నించిన ఎఎన్‌ఐ విలేఖరులపై దాడి చేయడాన్ని మనం చూశాము. వాషింగ్టన్ పోస్ట్ విలేఖరులు బాబ్‌ఉడ్‌వర్డ్, కార్ల్ బెర్డ్‌స్టెయిన్ వాటర్‌గేట్ ఉదంతంపై వరుసగా కథనాలు వ్రాస్తే అత్యంత బలవంతుడైన అమెరికా అధ్యక్షుడు రిచర్డ్ నిక్సన్ 40 ఏళ్ళ క్రితం పదవికి రాజీనామా చేయవలసి వచ్చింది. ఆ విలేఖరులకు ఆ సమాచారం ఎవరు అందించేవారో ప్రపంచానికి ఈమధ్యవరకూ తెలియదు. 'డీప్‌త్రోట్' అనే అతను సమాచారం అందించేవారని తెలిపినవారు, ఆ వ్యక్తి అసలు పేరు అతని మరణం తర్వాతనే బయటపెడతామని స్పష్టం చేశారు. అయితే ఎఫ్.బి.ఐలో ద్వితీయస్థానంలో అప్పట్లో పనిచేసిన మార్క్‌ఫెల్ట్ (91) తానే ఆ ''డీప్‌త్రోట్'' ను అని మే 31, 2005న ఒక పత్రికా ఇంటర్వ్యూలో బహిరంగంగా వెల్లడించారు. అమెరికాలో సైతం అప్పట్లో వాటర్‌గేట్ కథనాలు ప్రచురించడానికి ఇతర పత్రికలు అప్పట్లో సాహసించలేదు. ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్యదేశం అయిన భారతదేశంలో పత్రికా స్వాతంత్య్రం మాత్రం పలు ఆంక్షలకు గురవుతున్నదని రిపోర్టర్స్ వితవుట్ బోర్డర్స్ తమ వార్షిక నివేదికలో పేర్కొన్నది. మొత్తం 180 దేశాలలో పత్రికా స్వాతంత్య్రంలో ఈ సంస్థ భారత్‌కు 140 స్థానం ఇచ్చింది. భారతదేశంలో పాత్రికేయులు పాలక పక్షం, ప్రభుత్వానికి సంబంధించిన వారినుండే గాక ప్రయివేటు గ్రూపులనుండి సైతం దాడులకు గురవుతున్నారు. రాజకీయ పక్షాలు, తీవ్రవాదులు, ఉగ్రవాదులు, నేరస్థుల బృందా లు, ప్రదర్శకుల నుండి తరచూ దాడులకు గురవుతున్నారు. తనకు వ్యతిరేకంగా వార్తలు ప్రచురించినా, ప్రసారం చేసినా ఏమవుతుందో చూడండి అంటూ ఒక ముఖ్యమంత్రి బహిరంగ సభలో హెచ్చరికలు జారీచేయగలగడం చూశాము. ముఖ్యంగా జమ్ముకాశ్మీర్, ఛత్తీస్‌ఘడ్, ఈశా న్య రాష్ట్రాలలో పాత్రికేయులు అభద్రతాయుత పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. న్యాయస్థానాలు, పోలీసు అధికారులు సైతం పత్రికలవారినే దూకుడుగా వార్తాకథనాలు ఉండరాదనే రీతిలో మందలిస్తుండటాన్ని చూస్తున్నాం. పత్రికలపై దాడులకు పాల్పడిన వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవడం చూడలేకపోతున్నాము. గత సాధారణ ఎన్నికలకు ముందు ఫ్రీడంహౌస్ ప్రచురించిన నివేదిక ప్రకారం భారతదేశంలో పత్రికా సంస్థల, యజమానుల జోక్యం సైతం పత్రికా స్వాతంత్య్రాన్ని హరిస్తున్నది. ప్రపంచవ్యాప్తంగా ఇటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. అందుకనే ఐక్యరాజ్యసమితి 2012లో పాత్రికేయుల భద్రతకోసం ఒక కార్యాచరణ ప్రణాళికను రూపొందించింది. పాత్రికేయులపై పాల్పడే నేరాల పట్ల ఉపేక్షతను తొలగించే దినంగా నవంబర్ 2ను ప్రకటించింది. పౌరులు అన్ని విషయాలు తెలుసుకొని, సమాజ అభివృద్ధి అంశాలలో పూర్తి భాగస్వామ్యం అందించడానికి అవసరమైన భావ ప్రకటనా స్వాతంత్య్రాన్ని ప్రాథమిక హక్కుగా గుర్తించి, అమలుజరిగే విధంగా చూడటమే ఈ ప్రయత్నపు లక్ష్యం. ఐక్యరాజ్యసమితి పిలుపు అందుకొని పాత్రికేయులకు రక్షణ కల్పించడానికి అవసరమైన నియమ నిబంధనలు రూపొందించడం పట్ల నరేంద్రమోడీ ప్రభుత్వం తగు చొరవ చూపగలదని ఆశిద్దాం. అయితే పత్రికా స్వాతంత్య్రం పట్ల ఈ ప్రభుత్వం తన ఆసక్తిని ఇంకా ప్రదర్శించవలసి ఉంది. గత పదేళ్ళ యు.పి.ఏ పాలనా కాలంలో ప్రభుత్వంలో జరిగిన పలు భారీ అవినీతి కుంభకోణాలు పత్రికల ద్వారానే వెలుగులోకి వచ్చాయి. ఆయా కుంభకోణాలు వెలుగులోకి రాకుండా ఉండడానికి పలు పత్రికా సంస్థలు సహకరించినా, ఒక దశలో సాధ్యంకాలేదు. ముఖ్యంగా ఉన్నత న్యాయస్థానాలు క్రియాశీల పాత్ర వహించడం ప్రారంభించడంతో మీడియా సంస్థలు ప్రేక్షకపాత్ర వహించలేకపోయాయి. యు.పి.ఏ పాలనా కాలంలో పత్రికా ప్రతినిధులకు ఢిల్లీలో అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్ళడానికి, అధికారులను, రాజకీయ నాయకులను కలవడానికి ఇబ్బందులు ఉండేవి కావు. అయితే ప్రస్తుతం నరేంద్రమోడీ ప్రభుత్వంలో పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. కొందరు పార్టీ ఎంపీలు, మంత్రులు బాధ్యతారహితంగా మాట్లాడుతూ ఉండటంతో ప్రభుత్వ ప్రతిష్టకు ప్రమాదం ఏర్పడింది. దాంతో మం త్రులు, ఎంపీలు, ఉన్నతాధికారులు పత్రికల వారితో గతంలో వలే స్వేచ్ఛగా వ్యవహరించకుండా కట్టడిచేయవలసి వస్తున్నది. ప్రభుత్వ కార్యాలయాలకు, మంత్రుల ఇండ్ల కు పత్రికలవారు యధేచ్ఛగా వెళ్ళి ప్రతి విషయం గురించి ఆరాతీసే పరిస్థితులు నేడు లేవని చెప్పవచ్చు. చైనాలో మాదిరిగా పత్రికల కళ్ళకు గంతలు కట్టడం ద్వారా ప్రజలను శాశ్వతంగా మాయపుచ్చలేమని అందరూ గ్రహించాలి. చైనాలోని హాంకాంగ్‌లో నేడు న్యాయం, స్వాతంత్య్రంకోసం అంటూ ప్రజలు పెద్దఎత్తున నిరసన ప్రదర్శనలు చేస్తున్నారు. వాటికి సంబంధించిన వార్తలు చైనాలోని ఇతర ప్రాంతాలలో తెలియనే తెలియదు. టిబెట్‌ను చైనా ఆక్రమించి, అక్కడ నిరసనలకు అవకాశం లేకుండా, స్థానిక ప్రజలను తమ సంస్కృతి, సాంప్రదాయాలనుండి దృష్టి మళ్ళించడానికి గత 55 సంవత్సరాలుగా నిరంకుశంగా ప్రయత్నం చేస్తున్నది. అయినా స్థానిక ప్రజలలో మాత్రం నిరసన, అసమ్మతిలను కట్టడి చేయలేకపోతున్నది. 1959 తర్వాత జన్మించిన యువతరం నేడు తమ ధార్మిక అధినేత దలైలామాను టిబెట్‌కు రప్పించాలని కోరుతూ ఆందోళనలు సాగిస్తూనే ఉన్నారు. ఇప్పటికి 132 మంది యువకులు నిరసన ఉద్యమాలలో భాగంగా ఆత్మాహుతులకు పాల్పడ్డారు. చైనా పతాకం నీడలో జన్మించిన యువత దృష్టిని సైతం పత్రికా సమాచారాన్ని, భావప్రకటనా స్వాతంత్య్రాన్ని అణచివేసినా చైనా కట్టడి చేయలేకపోతున్నది. టిబెట్‌పై 55 ఏళ్ళయినా పూర్తి ఆధిపత్యం వహించలేకపోతున్నది. అత్యవసర పరిస్థితి కాలంలో పత్రికలపై ఉక్కుపాదం మోపి, జాతీయ నాయకుల అరెస్టులను సైతం ప్రచురింపకుండా నిరోధించినా ప్రజలలో నిరసనను ఇందిరాగాంధీ కట్టడి చేయలేకపోయినది. చివరకు తప్పనిసరి పరిస్థితులలో ఎన్నికలు జరిపి, పరాజయానికి గురయ్యారు. అయితే భారతదేశంలో పత్రికలకు పరిధులులేని స్వాతంత్య్రం ఉందని చాలామంది భావిస్తుంటారు. పలు అవినీతి కుంభకోణాలను వెలుగులోకి తేవడంలో, అధికార పక్షాలను ఇరకాటంలో పడవేయడంలో పలు పత్రికలు, న్యూస్ ఛానళ్ళ క్రియాశీల పాత్ర పోషించాయనడంలో సందేహం లేదు. అయితే ఇటువంటి సంఘటనలు పరిమితంగానే జరుగుతున్నాయి. మొత్తంమీద చూస్తే పలు పరిమితులు, వత్తిడులు, ప్రభావాలు మీడియాను ప్రభావితం చేస్తున్నట్లు అంగీకరించక తప్పదు. పలు సందర్భాలలో మీడియా సంస్థలు సైతం పక్షపాత ధోరణితో వ్యవహరిస్తుండటం జరుగుతున్నది. కొన్ని రాజకీయ, సామాజిక, ఆర్థిక అభిప్రాయాలకు, ప్రభావాలకు పరిమితంకావడం సైతం చూస్తున్నాం. వార్తను వార్తగా ప్రచురించడం అన్ని సందర్భాలలో సాధ్యంకావడం లేదని అంగీకరించక తప్పదు. ప్రభుత్వం సైతం వాస్తవాలను పత్రికలకు చెబితే అధికారులపై చర్యలు తీసుకుంటున్న ఉదంతాలు జరుగుతున్నాయి. కర్ణాటకలో నిజాయితీ అధికారిణిగా పేరొందిన రష్మిమహేష్‌ను మైసూరులోని ఐ.ఎ.ఎస్. అధికారులకు శిక్షణ కల్పించే పరిపాలనా శిక్షణా సంస్థకు డైరెక్టర్ జనరల్‌గా నియమించారు. అంతగా ప్రాధాన్యత లేదనుకున్న ఆ పదవిలో ఉండి ఆమె అంతకుముందు ఆరు సంవత్సరాల కాలంగా రూ.100 కోట్ల మేరకు సంస్థ నిధుల వినియోగంలో అక్రమాలు జరిగాయని కనుగొని నివేదికలు పంపారు. ఈ అవినీతిని వెలుగులోకి తేవడానికి ఆమెకు సహకరించిన ఒక క్యాంటిన్ మేనేజర్ అనూహ్యం గా హత్యకు గురయ్యారు. మృతదేహం చూడటానికి వెళ్ళిన ఆమెపై భౌతికంగా దాడి జరిపి, ఆమెను గాయపరచారు. ఈ సందర్భంగా ఆమె పత్రికల వారితో మాట్లాడితే అది సర్వీస్ నిబంధనలకు వ్యతిరేకం అంటూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆమెకు షోకాజ్ నోటీస్ జారీచేశారు. అయితే మరింత అప్రదిష్ట ఎదుర్కోవలసి వస్తుందని ఆమెను సస్పెండ్ చేయలేదు. పత్రికలను తమ ఇమేజ్ పెంచుకొనే సాధనాలుగా మాత్రమేగాక ప్రజాస్వామ్య వికాసానికి పత్రికా స్వాతంత్య్రం ఆయువుపట్టు అని గ్రహించాలి. ఆదరించాలి.