రాష్ర్టానికి తొలిసారి గిరిజనేతర సీఎం -దాస్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకొన్నారన్న నడ్డా -రేపు ముఖ్యమంత్రిగా ప్రమాణం -అమిత్‌షా, మోదీకి కొత్త సీఎం కృతజ్ఞతలు -ప్రభుత్వ ఏర్పాటు కోసం గవర్నర్‌ను కలిసిన బీజేపీ కూటమి -బీజేపీ నిర్ణయంపై గిరిజనుల నిరసన రాంచీ, డిసెంబర్ 26: రాష్ట్రం ఏర్పడిన 14 ఏండ్ల తర్వాత తొలిసారి జార్ఖండ్‌ను ఓ గిరిజనేతర ముఖ్యమంత్రి ఏలబోతున్నారు. తమ శాసనసభాపక్షనేతగా బీజేపీ ఉపాధ్యక్షుడు, ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన రఘువర్‌దాస్‌ను ఆ పార్టీ ఎమ్మెల్యేలు శుక్రవారం ఏకగ్రీవంగా ఎన్నుకొన్నారు. సీఎం రేసులో ఉన్న మరో అభ్యర్థి సరయురాయ్, సీపీ సింగ్.. దాస్ పేరును ప్రతిపాదించగా మిగతా ఎమ్మెల్యేలంతా మద్దతు తెలిపినట్లు పార్టీ పరిశీలకుడు జేపీ నడ్డా వెల్లడించారు. జార్ఖండ్ పదో ముఖ్యమంత్రిగా రఘువర్‌దాస్ ఆదివారం ప్రమాణం చేయనున్నారు. ఆయనతోపాటు పది మంది మంత్రులు ప్రమాణం చేస్తారు. తనకు ఈ అవకాశం ఇచ్చిన బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా, ప్రధాని నరేంద్రమోదీలకు దాస్ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. అవినీతిరహిత పాలన అందజేస్తానని హామీఇచ్చారు. 82 స్థానాలు కలిగిన జార్ఖండ్‌లో బీజేపీ-ఏజేఎస్‌యూ కూటమి 42 స్థానాలు గెలుచుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయబోతున్నాయి. ఈ మేరకు శుక్రవారం సాయంత్రం నాలుగు గంటలకు దాస్‌తోపాటు పలువురు ఎమ్మెల్యేలు గవర్నర్ సయ్యద్ అహ్మద్‌ను కలిశారు. మరోవైపు గిరిజనేతరున్ని బీజేపీ ముఖ్యమంత్రిగా చేయడంపై పలు గిరిజన సంఘాలు నిరసన వ్యక్తంచేశాయి. ఇది గిరిజనుల వ్యతిరేక నిర్ణయమంటూ దాస్ ముఖ్యమంత్రిగా ప్రమాణంచేసే రోజు రాష్ట్రబంద్‌కు జార్ఖండ్ పీపుల్స్ పార్టీ పిలునిచ్చింది. పోటీ లేకుండానే.. జార్ఖండ్‌లో తొలిసారి ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన పూర్తి మెజారిటీని బీజేపీ సాధించినా.. ముఖ్యమంత్రి ఎవరన్నదానిపై మూడురోజులుగా ఉత్కంఠ నెలకొన్నది. అయితే శుక్రవారం జరిగిన ఎమ్మెల్యేల సమావేశంలో మాత్రం రఘువర్‌దాస్‌ను శాసనసభాపక్షనేతగా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం విశేషం. ముఖ్యమంత్రిగా రఘువర్ పేరును ప్రకటించగానే ఆయన నియోజకవర్గంలో పండుగ వాతావరణం నెలకొన్నది. తనకు ఈ బాధ్యతలు అప్పగించిన బీజేపీ అగ్రనాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపిన దాస్.. ఓ సాధారణ కార్మికుడు కూడా సీఎం కావటం బీజేపీతోనేలాంటి పార్టీలోనే సాధ్యమవుతుందని అన్నారు. గిరిజన సంఘాల నిరసన గిరిజనేతరుడైన రఘువర్‌దాస్‌ను ముఖ్యమంత్రిగా చేయడంపై రాష్ట్రంలోని గిరిజన సంఘాలు తీవ్రంగా మండిపడ్డాయి. ప్రకటన వెలువడగానే రాష్ట్రవ్యాప్తంగా నిరనస ప్రదర్శనలు మిన్నంటాయి. బీజేపీ దిష్టిబొమ్మలను తగులబెట్టారు. ఈ నిర్ణయాన్ని నిరసిస్తూ దాస్ ముఖ్యమంత్రిగా ప్రమాణంచేసే రోజు రాష్ట్రబంద్‌కు జార్ఖండ్ పీపుల్స్ పార్టీ పిలునిచ్చింది. గిరిజనుల ఆకాంక్షలను నెరవేర్చే ఉద్దేశంతోనే జార్ఖండ్ రాష్ట్రం ఏర్పడిందని, అలాంటిది బీజేపీ ఇప్పుడు దాస్‌ను సీఎంగా ప్రకటించి గిరిజన సమాజం మనోభావాలను దెబ్బతీసిందని జేపీపీ అధ్యక్షుడు సూర్యాసింగ్ ఆరోపించారు. ఈ నిర్ణయం ద్వారా గిరిజుపై తమకు విశ్వాసం లేదని బీజేపీ సందేశమిచ్చినట్లయ్యిందని మాజీ సీఎం నితీశ్ విమర్శించారు. రాష్ర్టానికి గతంలో సీఎంలుగా చేసిన బాబులాల్ మరాండీ, అర్జున్‌ముండా, శిబుసోరెన్, మధుకోడా, హేమంత్‌సోరెన్ గిరిజనులే కావడం గమనార్హం. టాటాస్టీల్ ఉద్యోగే ఇప్పుడు సీఎం జార్ఖండ్ రాష్ట్ర తొలి గిరిజనేతర ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయబోతున్న రఘువర్‌దాస్.. ఒకప్పుడు టాటాస్టీల్‌లో ఉద్యోగం చేశారు. ఆయన సొంత రాష్ట్రం ఛత్తీస్‌గఢ్ అయినా.. జార్ఖండ్‌లో స్థిరపడ్డారు. 1954, డిసెంబర్ 18న జన్మించిన దాస్.. సైన్స్, న్యాయశాస్ర్తాల్లో పట్టా అందుకొన్నారు. 1974లో విద్యార్థి ఉద్యమాల్లో చురుగ్గా పాలుపంచుకొన్న దాస్.. తర్వాత టెల్కోలో కార్మికుల ఆందోళనల్లోనూ తనవంతు పాత్ర పోషించారు. లోక్‌నాయక్ జయప్రకాశ్‌నారాయణ్, మాజీ ప్రధాని అటల్‌బిహారీ వాజపేయి.. ఆయన ఆరాధ్య నేతలు. 1995 నుంచి జంషెడ్‌పూర్ తూర్పు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా చేస్తున్న రఘువర్‌దాస్.. 2009 డిసెంబర్ 30-2010 మే 29 మధ్యకాలంలో జార్ఖండ్ ఉపముఖ్యమంత్రిగా పనిచేశారు. 59 ఏండ్ల దాస్ ప్రస్తుతం బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడిగానూ ఉన్నారు.