ఈ మధ్య 'భారతరత్న' పురస్కారం మీద మనదేశంలో మోజు బాగా పెరిగింది. నిజానికి 'భారతరత్న' నిజమైన భారతరత్నలకు అందని సందర్భాలెన్నో ఉన్నాయి. మైనారిటీలను దువ్వడానికో, ఆయా పార్టీలను సంతోషపరచడానికో, వోట్ల బాంకులను కాపాడుకోడానికో, మరేవో రాజకీయ కారణాలకో 'భారతరత్న'లను పంచే రోజులు చాలాకాలం కిందటే వచ్చాయి. సుప్రీంకోర్టు కనీసం రెండుసార్లు ఈ 'భారతరత్న' వితరణను ఆపుజేసింది. ఈ దేశపు ప్రధానమంత్రి ఆయన స్వయం నిర్ణయం మీదే ఈ దేశంలో అత్యంత ఉన్నతమయిన పురస్కారం నిర్ణయించవలసి ఉండగా ఇద్దరు ప్రధానులు జవహర్లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీలు తమకు తామే భారతరత్నను ఇచ్చుకున్నారు. ఓ గొప్ప సంగీత విద్వాంసుడు తన భారతరత్న కోసం చాలావిధాలుగా ప్రయత్నం చేసి సాధించారని ఆ రోజుల్లో చెప్పుకున్నారు. ఏమయినా ఈ మధ్య 'భారతరత్న' మీద మోజు డొంకతిరుగుడు లేకుండా ఆయా పార్టీలు, నాయకులుతమ తమ నాయకులకు ఇచ్చితీరాలని కుండబద్ధలు కొట్టేశారు. కాన్షీరామ్‌కి ఇవ్వాలని మాయావతి బల్లగుద్దేశారు. రామ్ మనోహర్ లోహియాకు ఇవ్వాలని బీహార్ వర్గాలుంటున్నాయి. వీరసావర్కార్‌కి ఇవ్వాల్సిందేనని శివసేన డిమాండ్. ములాయం సింగ్ యాదవ్‌గారు మెట్రోమాన్ ఈ శ్రీధరన్‌కి ఇచ్చి తీరాలంటున్నారు. మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకి ఇవ్వాల్సిందేనని తెలంగాణా వర్గాలంటున్నాయి. అతల్ బిహారీ వాజ్‌పేయీకి యివ్వాలని పాలక పార్టీ బీజేపీ అప్పుడే ఒక నిర్ణయానికి వచ్చేసింది. సుభాష్‌చంద్ర బోస్ 'భారతరత్న'కు రెండోసారి ప్రతిఘటన వినిపిస్తోంది. ఈ మధ్య విశాఖపట్నంలో కొందరు ముస్లిం సోదరులు ఒక సభ జరిపి ఇకముందు ఏటేటా కనీసం ఇద్దరు ముస్లింలకయినా భారతరత్న ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎవరా ముస్లింలు? ఎట్టకేలకు ఒకరిని వెదికి పట్టుకున్నారు. అలీఘడ్ విశ్వవిద్యాలయం ఉపకులపతి సయ్యద్ అహమ్మద్ ఖాన్. మరి రెండో పేరు? వారికే తెలీదు! ఎవరయినా పరవాలేదు. ఎవరన్నది వారి ప్రమేయంకాదు. ఇదిలా ఉండగా అస్సాం ముఖ్యమంత్రి తరుణ్ గోగోయ్ ఈసారి 'భారతరత్న'ను నరేంద్రమోడీ భార్య జశోదాబెన్‌కి ఇవ్వాల్సిందే అన్నారు. ఆయన వెక్కిరింతగా అంటే ఆయన సందేశం ఈపాటికే ప్రభుత్వానికి అంది ఉండాలి. గమనించాలి ఈ ఈ వ్యక్తుల గొప్పతనాన్ని శంకించడం ఎంతమాత్రం కాదు. వారి గొప్పతనానికి ఈ 'కిరీటం' పెట్టడాన్ని గురించే ఈ ప్రసక్తి. ఈ దేశంలో నిజానికి ఏ దేశంలోనయినా ఆ జాతి గర్వపడే మహామహులను గౌరవించుకోడానికి సంవత్సరానికి రెండు అవకాశాలు చాలవు. (సంవత్సరానికి ఇద్దరికే 'భారతరత్న' ఇవ్వాలని నిబంధన కనుక్). ఎందరో మహానుభావులు ఈ దేశంలో ఉన్నారు. ఏ దేశంలోనయినా ఉంటారు. ఇద్దరిని గౌరవించుకోవడం కేవలం లాంఛనం. పోతన గొప్పకవి అని గౌరవిస్తే నన్నయ్యని అగౌరవ పరిచినట్టుకాదు. సర్వేపల్లి రాధాకృష్ణన్‌ను గౌరవించుకుంటే పరమహంస యోగానందను గౌరవించనట్టు కాదు. అయితే దేశం పట్టనన్ని 'భారతరత్న' డిమాండ్‌లు పెరుగుతున్నాయి కనుక అవన్నీ రాజకీయ డిమాండ్‌లు కనుక ఈ దేశం అనేక పార్టీల సమష్టి పాలనా వ్యవస్థగల దేశం కనుక అందరికీ న్యాయం జరపడానికి కొన్ని సూచనలు. 'భారతరత్న'ను ఇకనుంచీ రాష్ట్రాలకు అప్పగించండి. ప్రతీ పార్టీకి ఇద్దరు భారతరత్నల్ని ఎంపికజేయండి. జిల్లాకి కనీసం ఒక భారతరత్నను ఇవ్వడం అద్భుతమైన వికేంద్రీకరణ కాగలదు. ఫలానా వెంకయ్య తూ.గో. భారతరత్న, ఫలానా మునిరత్నం పొ. శ్రీ. భారతరత్న అని చెప్పుకుని గర్వపడతాం. మనకి ఖేల్ రత్నలాగే గాన్ రత్న, నాచ్ రత్న, రైతురత్నలను గౌరవించుకోనివ్వండి. ఓడిపోయిన పార్టీలకు కూడా కనీసం ఒక 'రత్న'ని యివ్వండి. మనకి జైళ్లలో ఉన్న రత్నాలు కొన్ని ఉన్నాయి. కనుక ప్రతిజైలుకీ ఒక 'భారతరత్న'ను కేటాయించండి. అలాగే ప్రతి భాషకీ ప్రతి యేడూ రెండు భారతరత్నలు. చేతిపనుల రత్నాలు, జానపదరత్నాలు, మండల రత్నాలు యిలా యీ పురస్కారాలను విస్తృతపరచండి.ముఖ్యంగా ఓడిపోయిన పార్టీ నాయకులకు తప్పనిసరిగా ఒక 'రత్న'ని ఇచ్చి సముదాయించవచ్చు. నేటి ఓడిన నాయకుడే రేపు పదవిలోకి వచ్చిన నాయకుడు కావడం మనం చాలా సార్లు చూశాం. ఈ వ్యవస్థలో పరిణామం ప్రతిభకు తూకపురాయి కాదని ఈ 'భారతరత్న'లు నిరూపిస్తారు. సుప్రీం కోర్టు కొలీజియంలాగే మనపద్మా అవార్డుల ఎన్నిక సంఘంలాగే ఈ పురస్కారాల నిర్ణయానికి అన్ని రాజకీయ పార్టీల నాయకులతో ఒక కమిటీని ఏర్పరచాలి. ఆ కమిటీకి మమతా బెనర్జీని అధ్యక్షులుగా ఉంచాలని నా సూచన. ఆమెకే నా వోటు. మనం మన తండ్రిని గౌరవిస్తాం. ఆతని అర్హతల్ని చూసికాదు. డిగ్రీల్ని, సేవని పరిశీలించికాదు. కేవలం అతను తండ్రి కనుక. జాతి యావత్తూ కలిసి సమర్పించే నివాళిని మనం ప్రశ్నించడం ప్రారంభించగానే దాని విలువ సగం చచ్చింది. అది కేవలం జాతి ఉదాత్తతకి గుర్తు. దాని బేరీజు అక్కడే ఆగాలి. ''జనగణమణ'' మన దేశభక్తి గేయం. అది ఒక సంకేతం. దాన్నే ఎందుకు పాడాలి? ''నా దేశం బంగారు కొండ'' అని ఎందుకు పాడకూడదు? అంటే ఇక దాని విలువ ఏముంది? బ్రిటిష్ రాణీ ఏ విధంగా తమ దేశానికి ప్రతీక?'' అని ఒక్కసారి ఆ దేశం ప్రశ్నిస్తే ఒక గొప్ప సంప్రదాయానికి తెరపడిపోతుంది భారతరత్నను డిమాండ్ చేసేవారు తమ పార్టీ ప్రయోజనాలో, తమ ప్రాంతీయ ప్రాముఖ్యమో, తమ ప్రాబల్యమో దృష్టిలో పెట్టుకున్నవారయినా ఉండాలి లేదా ఆ సత్కారం ఉదాత్తతను అటకెక్కించినవారయినా ఉండాలి. 'భారతరత్న' ఈ జాతి పెద్ద మనస్సుతో యిద్దరు మహనీయులను సత్కరించుకునే సత్సంప్రదాయం. అందులో రాజకీయాలు జొరబడితే ఆ సంప్రదాయం భ్రష్టుపట్టినట్టే. చివరగా 'భారతరత్న' రేషన్ కార్డ్ కాదు ప్రతీ వ్యక్తీ తన హక్కును డిమాండ్ చెయ్యడానికి. చక్కెర, ఉల్లిపాయల కేటాయింపుకాదు. ఆ స్థాయికి దాన్ని దిగజార్చడం మొదలెడితే సంప్రదాయపు గంభీర ఉదాత్తత మంటగలిసినట్టే. ఆ తర్వాత ఆ పురస్కారాన్ని పప్పు సోమయ్యకి ఇచ్చినా, ధనియాల వీర్రాజుకి ఇచ్చినా, పిల్లి పెసర శీనయ్యకి ఇచ్చినా ఒక్కటే. దేశానికి మకుటాయమైన గౌరవాన్ని సమకాలీన ప్రయోజనాలకు కుదిస్తే ఒక వ్యవస్థని కూలదోసినట్టే.